నేరపూరిత వైసీపీ తో బలంగా పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం నాడు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ‘జనసేనానితో గ్లాసు టీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ యువతీ యువకుల ఆలోచనలు విన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ‘‘శక్తివంతమైన యువ సమూహం అండ నాకు ఉంది. నాకు నిరంతరం వెన్నంటి ఉండేది యువత బలమే. సగటు మనిషి ఆవేదనలు తీర్చాలంటే చట్టసభల్లో మన గొంతు బలంగా వినబడాలి. నవతరం ఆలోచనలు ప్రభావితం చేసేలా ఉండాలి. యువతకు భరోసా కల్పించేలా ప్రజా పాలసీలను తీసుకువస్తాం. యువతరానికి కచ్చితంగా నేను పూర్తి స్థాయిలో అండగా నిలిచే బాధ్యత తీసుకుంటాను’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు.