ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. త్వరలో జరగనున్న ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఉత్సాహంతో ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యింది. ఇటీవలే.. వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరటంతో మరింత జోష్ పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నుంచి కూడా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండటం గమనార్హం. ఇక ఈ సమయంలో.. కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. శనివారం రోజు మీడియాతో మాట్లాడిన చింతా మోహన్.. చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం.. ఏపీలో కాపు సామాజిక వర్గం నేతలు సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారని చెప్పుకొచ్చారు చింతా మోహన్. ముఖ్యమంత్రి కావాలంటే కాపు సామాజిక వర్గానికి ఈ ఎన్నికలు సువర్ణ అవకాశంగా అభివర్ణించారు.
అయితే.. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి బరిలోకి దిగాలని చింతా మోహన్ కోరారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి చిరంజీవి పోటీ చేయాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు.. ప్రచారం కూడా చేయాల్సిన పని లేదని.. ఆయనను 50 వేల మెజారిటీతో గెలిపించేందుకు తిరుపతి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం అవటం పక్కా అని జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది చిరంజీవేనని చింతా మోహన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇండియా కూటమి పోటీకి మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంట్ స్థానాలను ఇండియా కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని పోటీ చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతుందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి.. కొంతకాలానికే కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా.. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర మంత్రి పదవిని ఇచ్చింది. అయితే.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు చిరంజీవి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.