అధికార వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహితుడు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆయన మరో రెండు, మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్‌ను కలిసి జనసేనలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇక, 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచారు. స్థానికేతురుడైనా జగన్ సీటును కేటాయించారు. అయితే, ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు పలువురు వైఎస్ఆర్సీపీ ఎంపీలు హాజరుకాగా.. వారిలో వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఈ వ్యవహారంపై జగన్ సీరియస్ అయ్యారని.. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లారని మండిపడ్డారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా బాలశౌరిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ కోసం ఇతరుల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలశౌరి వైఎస్ఆర్సీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను రహస్యంగా కలిశారని ప్రచారం కూడా సాగుతోంది. శుక్రవారం సాయంత్రం పవన్‌తో భేటీ జరిగిందని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మచిలీపట్నం ఎంపీగా ఉన్నా.. మంత్రిగా మూడేళ్ల పాటు ఉన్న మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో ఆయనకు పొసగలేదు. ఇరు వర్గాలూ పలుసార్లు బాహాబాహీ తలపడ్డారు. ఈ వ్యవహారంపై హైకమాండ్ ముందు పంచాయతీ జరిగింది.