ఇవాళ్టీ నుంచి 87 రోజులే.. కౌంట్ డౌన్ ప్రారంభమైంది.. లెక్క పెట్టుకోండి... దేవతల రాజధానిని రాక్షసులు చెరపట్టినట్టు.. అమరావతిని వైసీపీ చెరబట్టిందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్‌తో కలిసి చంద్రబాబు రాజధాని ప్రాంతం మందడంలో జరిగిన భోగిమంటల వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతే మన రాజధాని అని.. త్వరలో ఇక్కడ నుంచే పేదల పాలన మొదలు కాబోతోందని.. ఇక్కడే రాజధాని ఉంటుందని టీడీపీ - జనసేన భరోసా ఇస్తుందని స్పష్టం చేశారు. సంక్రాంతి రోజున అంగన్‌వాడీలను సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డున పడేశారని, యువతకు ఉపాధి కల్పించేలా టీడీపీ - జనసేన పార్టీ భరోసా ఇస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలిచే బాధ్యత ఈ రెండు పార్టీలదేనన్నారు. వైసీపీ ప్రభుత్వం కరవు మండలాలను కూడా పట్టించుకోకుండా కేంద్ర సాయం కూడా రాకుండా చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. చీకటి జీవోలను మంటల్లో వేశామని, జగన్ అహంకారాన్ని కూడా మంటల్లో వేశామన్నారు. భస్మాసురునికి వరం ఇచ్చినట్టు జగన్‌కు ప్రజలు ఓటేశారని, పోలీసులను తానేం అనలేను కానీ.. ప్రభుత్వం ఒత్తిడి వల్ల రాక్షసుల్లా పోలీసులు వ్యవహరించారన్నారు. ఇదే పోలీసులు మీకు జిందాబాద్ కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాలను కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రపంచంలో మూడు రాజధానులనేవి ఎక్కడా లేవని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు సంక్రాంతి సంబరాలను తన సొంత ఊరు నారావారిపల్లెలో జరుపుకునేందుకు ఆదివారం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్‌కు చేరుకుని బయలుదేరతారు. రాత్రికి నారావారిపల్లెలో బస చేసి, రేపు ఇంటి దేవుళ్ళకు తల్లిదండ్రుల సమాధులకు చంద్రబాబు కుటుంబ సభ్యులు పూజలు చేయనున్నారు.