శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మొగిలిపాడు సమీపంలో జాతీయ రహదారిపై పండగపూట ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు టూరిస్టు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా... సుమారు 30 మంది యాత్రికులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 అంబులెన్స్‌లో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేషనల్ హైవే సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ... క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తీశారు. మధ్యప్రదేశ్ అనుపూర్ జిల్లాకు చెందిన సుమారు 150 మంది యాత్రికులు రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులలో పూరి దర్శనం అనంతరం అన్నవరం దర్శనానికి వెళుతుండగా.. పలాస మండలం మొగిలిపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.