అయోధ్య ప్రారంభోత్సవానికి టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వాన పత్రిక అందింది. ఈ నెల 22 వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సీనియర్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు.. ఇలా చాలా మందికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందిస్తోంది. ఈ నెల 22 వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉండగా.. ఆ అపూర్వ ఘట్టానికి సంబంధించి ఇప్పటికే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వ తేదీన మధ్నాహ్నం 12:20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులకు అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవి.. ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్‌కు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు చేరాయి. ఇక హీరో ప్రభాస్‌కు కూడా ఆహ్వానం అందింది.
ఇక జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానం అందింది. ఈ నెల 3 వ తేదీన మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలు పవన్ కల్యాణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా అయోధ్యలో నిర్మితమైన రామాలయం విశేషాలను, రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి సంబంధించిన విశేషాలను పవన్ కల్యాణ్ కు తెలియజేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభం కాగానే పవన్ కల్యాణ్ రూ.30 లక్షలు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. 2021లో తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు.