వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తోపాటే ఉన్న బాలశౌరి ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరతానని జనవరి 13న బాలశౌరి ప్రకటించారు. ఈ నెల 18 లేదా 22న ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని తెలుస్తోంది. దీంతో సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన నేతలు ఎంపీ నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలను బాలశౌరి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని.. అవనిగడ్డ నుంచి బాలశౌరి కుటుంబీకుల్లో ఒకరికి లేదా ఆయన సంబంధీకులకు అసెంబ్లీకి పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలకు చెందిన నాయకులు బాలశౌరిని కలుస్తున్నారు. 2014లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన బాలశౌరి.. 2019లో మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. విజయసాయిరెడ్డితో కలిసి ఆయన ఢిల్లీలో చక్రం తిప్పారు. వైఎస్ కుటుంబానికి ఆయన ఎంతో సన్నిహితుడు. అలాంటిది జగన్ ఆయన్ను ఎందుకు పక్కనబెట్టారనే చర్చ నడుస్తోంది. ఇటీవల బాలశౌరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని కలిశారని.. ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచే జగన్ ఆయన పక్కనబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే బాలశౌరి జనసేనలో చేరాలని ఎప్పుడో డిసైనట్లు కనిపిస్తోంది. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని చక్రాయపాలెం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌కు 2023 జూలైలో ఆయన మెగాస్టార్ చిరంజీవి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో చక్రాయపాలెంలో కమ్యూనిటీహాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఆ నిధులు సరిపోకపోవడంతో.. నిర్మాణం మధ్యలో ఆగిపోయింది.
చక్రాయపాలెంను సొంత ఊరిగా భావించే బాలశౌరికి ఈ విషయం తెలిసి బాధపడ్డారు. మరో రూ.40 లక్షలు ఖర్చు చేసి నాలుగు నెలల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేస్తామని.. దానికి మెగాస్టర్ చిరంజీవి కమ్యూనిటీ హాల్ అని నామకరణం చేస్తామని గత ఏడాది జులైలో బాలశౌరి ప్రకటించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన.. తాను చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. దీంతో బాలశౌరి పార్టీ మారాలని అప్పుడే డిసైడయ్యారని.. అందుకే జగన్ పేరు పెట్టకుండా కమ్యూనిటీ హాల్‌కు చిరంజీవి పేరు పెట్టారని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇది నిజమో కాదో చెప్పలేం కానీ.. వైసీపీలో ఉండగానే చిరంజీవి పట్ల అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్న బాలశౌరి.. ఇప్పుడు పవన్ పార్టీలో చేరుతుండటంతో జనసైనికులు ఖుషీగా ఫీలవుతున్నారు.