తన ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు ప్రియుడి సాయంతో ఓ అమాయకురాలని చంపి ఆ కేసును భర్తపైకి నెట్టే ప్రయత్నం చేసింది. చివరకు బండారం బయటపడి జైలు పాలైంది. ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం కానూరులో జరిగిన గరిగల నాగమణి(32) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను సినీ ఫక్కీలో హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని ప్రియుడు, ప్రియురాలు పన్నిన పన్నాగంగా పోలీసులు తేల్చారు.
వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడుకు చెందిన ఐతాబత్తుల మృధులాదేవి, రవీంద్రలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రవీంద్ర ఓ ప్రైవేటు కంపెనీలో డిప్యూటీ మేనేజరు కాగా.. మృధులాదేవి ఓ బాడీకేర్ సెంటర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ బాడీకేర్ సెంటర్‌కు తరచూ వచ్చే కృష్ణలంకకు చెందిన పోలాసి సాయిప్రవీణ్ అనే యువకుడుతో ఏర్పడిన పరిచయం ఇద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో వారిద్దరూ కలిసి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారు. సాయి ప్రవీణ్‌తో కలిసి మృధులా వెళ్లిపోగా.. భర్త బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చాడు.
అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. సాయిప్రవీణ్‌కు దూరమవ్వాల్సి ఉంటుందని భావించి ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మృధులాదేవి, సాయిప్రవీణ్‌లు చర్చించుకుని భర్త రవీంద్రను ఏదైనా హత్య కేసులో ఇరికించి జైలుకు పంపాలని స్కెచ్ వేసింది. గతంలో తన ఇంట్లో అద్దెకున్న గరిగెల నాగమణిని హత్య చేసి ఈ నేరాన్ని రవీంద్రపైకి నెట్టేయాలనే పథకం రచించారు. అందుకు నాగమణికి సాయి ప్రవీణ్, మృధులా దేవీలు దగ్గరయ్యారు. ఈ నెల 13వ తేదీన నాగమణి భర్త కిరణ్‌గోపాల్ ఏలూరు వెళ్తున్నట్టు తెలుసుకున్న సాయిప్రవీణ్.. తన పథకం అమలు చేయడానికి ఇదే అదనుగా భావించాడు. నాగమణిని ఎనికేపాడు రప్పించాడు. మృధులాదేవి భర్తకు సంబంధించిన కొన్ని మాటలను రికార్డు చేయాలని ఈమెను కానూరు వందడుగుల రహదారిలోని ఓ వ్యవసాయబావి షెడ్డు వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడ మృధులాదేవితో ఆమె సెల్‌ఫోన్‌లోనే రవీంద్ర తనను మోసం చేశాడని, తనను శారీరకంగా వాడుకుని తన బంగారం కూడా తాకట్టు పెట్టుకున్నాడని తనకు ఏదైనా హాని జరిగితే రవీంద్రే కారణమంటూ ఆమెతోనే మాట్లాడించి వాయిస్ రికార్డు చేయించాడు. వాయిస్ రికార్డు పూర్తవగానే నాగమణి మెడకు చున్నీ బిగించి చంపేశారు. నాగమణి చనిపోయిందని నిర్ధారించుకున్న సాయిప్రవీణ్ ఈమె సెల్‌ఫోన్ తీసుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె భర్త కిరణ్ గోపాల్‌కు, ప్రియురాలు మృధులాదేవికి రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌లు పంపించాడు. వీటిని అడ్డుపెట్టి భర్తను బెదిరించాలని మృధులాదేవికి తెలిపాడు.
ఈ విషయాలను పోలీసులు టెక్నాలజీ సాయంతో గుర్తించారు. మృధులాదేవి భర్త రవీంద్రను విచారించగా.. తన భార్య అక్రమ సంబంధం వ్యవహారాన్ని బయటపెట్టాడు. దీంతో మృధులాదేవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చిక్కుముడి వీడింది. సాయిప్రవీణ్, మృధులాదేవి, వీరికి సహకరించిన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన మూర్తిబాబులపై మర్డర్ కేసు నమోదు చేశారు. మంగళవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా నిందితులకు రిమాండ్ విధించింది.