సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ కసరత్తు ఇంకా సాగుతోంది. గురువారం రాత్రి పొద్దుపోయాక తొమ్మిది మందితో కూడిన జాబితాను విడుదల చేసిన జగన్ మరికొన్న కీలక అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలపై దృష్టి సారించారు. శుక్రవారం అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో బిజీగా ఉన్న ఆయన ఎంపికల కార్యక్రమాన్ని సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించేశారు. కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. అయితే పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తనకు సహకరించడం లేదని ఆమె ఫిర్యాదు చేశారు. దొరబాబు అనుచరులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గీత అసహనం వ్యక్తం చేశారు. అయితే.. సిట్టింగులకు చాన్స్ ఇవ్వకుండా, సహకరించాలంటే ఎలా అని పార్టీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో వంగా గీత బలమైన అభ్యర్థిగా జగన్ విశ్వసిస్తున్నారు. అందుకు భిన్నంగా ఆమె స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను సీఎంఓ దృష్టికి తీసుకువెళ్లడం చర్చనీయాంశమయింది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా సీఎంఓకు గురువారం వచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వచ్చారు. అనకాపల్లి టికెట్ దక్కకపోవడంతో పెందుర్తి స్థానం ఇవ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరుతున్నారు. గురువారం పెందుర్తి ఎమ్మెల్యే అది్‌పరాజ్ తనకు మరో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. వీరద్దరూ గురువారం సీఎంఓకు వచ్చారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల, మంత్రి బొత్సలతో సమావేశమయ్యారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ కూడా మరోసారి సీఎంఓకు వచ్చారు. అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటూనే నేతలు క్రమం తప్పకుండా సీఎంఓకు రావడం నియోజకవర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, ఈ నెల 25న సీఎం జగన్ విశాఖ జిల్లా భీమిలిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు.