ఎన్నికలకు సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తమ పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం వెబక్స్ మాధ్యమం ద్వారా ఆమె బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు ఏవిధంగా సన్నద్ధం కావాలనే అంశాలను వివరిస్తూ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘రాష్ట్రాన్ని ఐదు క్లస్టర్లుగా విభజించి, ఆయా క్లస్టర్ల వారీగా నిర్వహించే కార్యక్రమాలకు పార్టీ జాతీయ నాయకులు హాజరవుతారని చెప్పారు. తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునేవారికి బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఓటర్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహించాలో వివరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో వాల్ రైటింగ్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ కార్యక్రమాన్ని పొడిగించినందున ఈ కార్యక్రమంలో పార్టీ నేతలందరూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.