ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఇప్పటివరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఆర్‌ఐవో నేతృత్వంలో పరీక్షలు జరుగగా, ఈ ఏడాది నుంచి సమూల మార్పులు చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా కొత్తజిల్లాల ప్రాతిపదికన ఈ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఆ ప్రకారం పరీక్షల నిర్వహణ మొదలుకుని సిబ్బంది నియామకాలు, మూల్యాంకనం తదితర పనులన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే జరుగుతాయి. ఏలూరు జిల్లాలో మొత్తం 126 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫిబ్రవరి 2న ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 3న ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్షలతో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సైన్స్ సబ్జెక్టుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఒకేషనల్ విభాగంలో ఫిబ్రవరి 5 నుంచి, జనరల్ విభాగంలో 10 నుంచి జరుగుతాయి. ఈ ప్రాక్టికల్స్‌కు ఒకేషనల్ సబ్జెక్టుల్లో మొత్తం 4,501 మంది, జనరల్ విభాగంలో 9,909 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకు న్నారు. ఇక ప్రధాన పరీక్షలైన థియరీ పరీక్షలు మార్చి 1నుంచి 20 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు జిల్లాలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 13,514 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,430 మంది హాజరు కావాల్సి ఉంది. జిల్లాలో 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, వారం రోజుల్లో వీటి సంఖ్యను ఖరారు చేయనున్నారు. కాగా ప్రాక్టికల్ పరీక్షలకు ముందే విద్యార్థు లకు హాల్ టిక్కెట్లను అందజేయాలని నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్‌ఐవో బాధ్యతలను అక్కడి డీవీఈవోకు ఇన్‌చార్జి అధికారిగా అప్పగించారు.