వైసీపీ టికెట్ల కేటాయింపుల్లో సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకే అత్యధికంగా అన్యాయం చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా, సాతులూరులో టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రత్తిపాటి పుల్లారావు , చదలవాడ అరవిందబాబు, గుంటుపల్లి నాగేశ్వరరావు, జనసేన నేత తోట రాజా రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీలపై పెత్తనం చెలాయించడమేనా బీసీ సాధికారత అని ప్రశ్నించారు. బీసీలు బలపడకూడదు, బాగుపడకూడదన్నదే జగన్ దురాలోచన అని చెప్పారు. బీసీలను మానసికంగా దెబ్బ తీసేందుకు వారిపై 26 వేలకు పైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. తోట చంద్రయ్యతో సహా 300 మంది బీసీలను వైసీపీ అంతం చేసిందన్నారు. పేరుకు బీసీలకు పదవులు, హోదాలు ఇచ్చి వారిపై జగన్ వర్గం పెత్తనం చెలాయిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.