కాకినాడ జిల్లా కరపలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన షేక్ రామ్‌తుల్లా(50) కొన్నేళ్ల కిందట కరప వచ్చి కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. స్థానిక స్వర్ణ థియేటర్ వద్ద ఇద్దరు కుమారులతో కలిసి చికెన్ షాపును నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. వ్యాపారం ముగించుకుని పెనుగుదురు మసీదులో నమాజ్ చేసుకోవడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా కాకినాడ నుంచి రామచంద్రపురం వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి రామ్‌తుల్లాను బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. తన చికెన్‌షాపు సమీపంలోనే జరిగిన ఈ ప్రమాదంలో రామ్‌తుల్లా తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. క్షతగాత్రుడిని కు టుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించామని, నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపడతామని పోలీసులు వివరించారు.