విజయనగరం జిల్లా, ఆలూరు సమీపంలో గల సంకెళ్ల గుమ్ములో పడి యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. శుక్రవారం మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల కథనం ప్రకారం రామభద్రపురం మండలం నేరళ్లవలసకు చెందిన కాదల ప్రదీప్ (15) చెరుకుగుడ్డిలో గల బంధువుల ఇంటికి ఇటీవల వెళ్లాడు. బుధవారం సరదాగా సంకెళ్ల గుమ్ము జలపాతం వద్దకు వెళ్లాడు. నీటిలో ఆటలాడుతూ గల్లంతయ్యాడు. ఈ మేరకు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్‌ఐ నారాయణరావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయానికి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.