ఉపాధ్యాయులకు ఉన్న బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వ నాన్చి వేత ధోరణిని వ్యతిరేకిస్తూ శుక్రవారం పీలేరులోని యూ టీఎఫ్ నాయకులు తమ నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పీలేరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ.... ఏడాదిగా పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సరెండర్ లీవ్, డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తమ ఖాతాల్లో పీఎఫ్ సొమ్ము ఎంత ఉందో కూడా తెలియని గందరగోళ స్థితిలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉన్నారని వాపోయారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమన్నారు. కార్యక్రమంలో నాయకులు సదాశివరెడ్డి, చంద్రశేఖర్, రాధాకృష్ణ, రమేశరెడ్డి, వెంకట రమణ, దేవేందర్ రెడ్డి, విజయకుమార్, అనిరుద్రయ్య, నారాయణ నాయుడు, ఈశ్వరయ్య, జయరాం, సుధాకర్, రవికుమార్ పాల్గొన్నారు.