కడప జిల్లాలోని ఎమ్మెల్యేలు ఐదేళ్లుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతుంటే వారిని జగన మందలించలేదని, చూసీచూడనట్లు వదిలేశారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది దళిత ఎమ్మెల్యేలను మార్చారు. అవినీతి ఆరోపణలున్న కడప జిల్లాలో మార్చడం లేదు. ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనన్న భయం జగనలో ఉందని చంద్రబాబు మండిపడ్డారు.పులివెందులలో గెలిచిన జగన ఇసుక, మద్యం కబ్జాలు ఇతరత్రా వాటితో రాష్ట్రాన్ని దోచుకుంటే.. పులివెందులలో మాత్రం ఆయన తమ్ముడు మదనమోహనరెడ్డి దోచుకుంటున్నారని అన్నారు. పులివెందుల భూకబ్జాలు, పనుల్లో కమీషన్లు, దళిత మహిళ నాగమ్మ హత్యాచారం ఇలా ఒకటేంటి పులివెందులను చెరబట్టారు. ఇక మేనల్లుడికి దీటుగా ఆస్తులు సంపాదించాలనుకున్న కమలాపురం ఎమ్మెల్యే కరప్షన కింగ్‌గా మారారు. లేపాక్షిలో 20వేల కోట్ల విలువ చేసే 9వేల ఎకరాలను చీప్‌గా కొట్టేయాలనుకున్నారు. కడప శివార్లలో 200 కోట్ల విలువ చేసే 54 ఎకరాల భూమి కాజేశారు. సర్వరాయప్రాజెక్టు పరిధిలో 400 ఎకరాలు ఆక్రమించారు. బుగ్గవంకను ఆక్రమించి సినిమా థియేటరును నిర్మించారంటూ మండిపడ్డారు. ఇక బద్వేలులో 2వేల కోట్ల విలువచేసే భూములు కబ్జా చేశారు. రికార్డులు మార్చేశారు. వైసీపీ నేతలు ఆక్రమించిన భూములు, తిన్న సొమ్మును కక్కిస్తాం. ఇక డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కడపలో హజ్‌హౌస్ కట్టలేని ఉత్సవవిగ్రహం. ఆయన హయాంలో ముస్లింల సంక్షేమం కోసం రూపాయి ఖర్చు పెట్టలేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్.. ఆయనకు అభివృద్ధి తెలీదు. ప్రతిపక్షాలపై కేసు నమోదు చేశారు. టీడీపీ బీసీ నేత నందం సుబ్బయ్యను పొట్టనబెట్టుకున్నారు. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతోంది. తనను హత్య చేసిన వారిని అంతం చేసేంత వరకు వదలదు. కర్ణాటక డీజలు తెచ్చి ప్రొద్దుటూరు పెట్రోలు బంకుల్లో అమ్మాలని ఆదేశిస్తారు. ఆయన మాట్లాడేది బూతులు, చివరికి ఎస్పీని కూడా తిట్టినా పోలీసులకే దిక్కులేదు. మైదుకూరు ఎమ్మెల్యే నంద్యాలంపేటలో 104 ఎకరాలు ఆక్రమించారు. చింతకుంటలో మైనార్టీ నేత అక్బర్‌కు చెందిన భూమిని ఆక్రమించేశారు. ఇసుక, మట్టికి చెరబట్టారు. ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే పేరుకే డాక్టరు. కానీ పెద్ద యాక్టరు. పైకి ఫోజులు లోన మాత్రం పర్సంటేజీలు. చికెనషాపుల నుంచి వాటాలు తీసుకుంటారు. నియోజకవర్గంలోని క్వారీల నుంచి పర్సంటేజీలు తీసుకుంటారు. మైలవరంలోని సోలార్‌ప్రాజెక్టు నుంచి డబ్బులు లాగారు. పెన్నానదిలో ఇసుక దందా చేస్తూ కోట్లు కొల్లగొట్టారు అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.