ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టిక్కెట్ల కోసం అన్నదమ్ములు పోటీపడే పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో కోవూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడి ఆడియో ఒకటి సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తన అన్నకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే సోదరుడు రాజేంద్రకుమార్ రెడ్డి చేసిన విన్నపం స్థానికంగా కలకలం రేపుతోంది. తన అన్న వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, దయచేసి తన అన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఆడియో క్లిప్పింగ్‌లో సొంత అన్నపైనే రాజేంద్రకుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని మార్చాలని సీఎం జగన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. సొంత కుటుంబసభ్యులను దూరం పెడుతున్నారని, ప్రజలను కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలోని మండలాలను.. నాయకులకు పంచి పెట్టారని రాజేంద్ర రెడ్డి ధ్వజమెత్తారు. అక్కడ అంతా ఆ నాయకులదే హవా అని, ఎమ్మెల్యే.. ప్రజలకు మధ్య వీరు అడ్డుగోడలా నిలిచారని ఆరోపించారు.
బుచ్చిరెడ్డిపాలేంకి చెందిన వెంకటరమణయ్య అనే వ్యక్తి సర్వం తానై వ్యవహరిస్తున్నారని.. తనతో పాటు, కుటుంబసభ్యులను కూడా దూరం పెట్టారని విమర్శలు చేశారు. ‘మాకంటే వెంకట రమణయ్యకే ప్రాధాన్యం ఇస్తున్నారు.. ప్రసన్నకుమార్ అన్న చేసిన తప్పిదాల వల్లే 2004.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చినా వారిని పట్టించుకోవడంలేదు.. అన్ని విషయాలను సీఎం జగన్ గమనించాలి’ అని అన్నారు. తన సోదరుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వద్దని కోరారు. అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిని కొనసాగించవద్దు.. ఆయన్ను మార్చేసి కొత్త అభ్యర్థిని నిలబెట్టండి అని జగన్‌ను అభ్యర్థించారు. డీసీఎంఎస్ ఛైర్మన్‌తో అతడి మాట్లాడిన సంభాషణల ఆడియో బయటకు రావడంతో తెగ వైరల్ అవుతోంది.