వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అమరనాథరెడ్డి వాపోయారు. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందని చెప్పారు. దొంగ ఓట్లు వేయడం, తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి అక్రమ మార్గంలో పదవులు సంపాదించుకున్నారని విమర్శించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించినా అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు చొరవ తీసుకుని.. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన కొందరు అధికారులను సస్పెండ్ చేయడం హర్షనీయమన్నారు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు లూటీ చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఎన్ని కేసులు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.