వైఎస్ షర్మిల ఆదివారం ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకుని అక్కడి నుంచి కారులో విజయవాడకు వస్తారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు మాణిక్యం ఠాగూర్, మునియప్పన్, కృష్టఫర్ తిలక్, ఏపీసీసీ కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతారు. వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరి వెళతారు. కానురులో కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్ర రత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వచ్చి.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి షర్మిల హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. వైఎస్సార్టీపీని షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు పార్టీ అధిష్టానం పెద్ద బాధ్యతలే అప్పగించింది. షర్మిలను ఏపీపీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించింది. అంతకుముందు ఏపీసీసీ చీఫ్‌గా ఉన్న గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అధిష్టానం నియమించింది.