తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో అంగన్‌వాడీలు తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తున్నారు. సోమవారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఆరువేల మంది అంగన్వాడీలు విజయవాడ రోడ్లమీద బైఠాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు విజయవాడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌టీవోఎస్ రోడ్లులో బైటాయిస్తామన్నారు. కర్ణాటకలో అంగన్‌వాడీలు ఏ విధంగా వారి జులూం చూపించారో అదే విధంగా ఇప్పుడు ఏపీలో తాము చూపించబోతున్నామన్నారు. ప్రభుత్వమా?, అంగన్‌వాడిలా? అన్నది తేల్చుకోబోతున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ అంగన్‌వాడీలను అరెస్టు చేసి కల్యాణ మండపాలకు, పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తే తాము కూడా అక్కడే ఉంటామన్నారు. సాయంత్రానికి పోలీసులు పంపించినా.. వెళ్ళామని స్పష్టం చేశారు. అంగన్‌వాడీలతోపాటు అంగన్‌వాడీల కుటుంబాలు కూడా చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొంటాయన్నారు. ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభ్యుదయవాదులు, అందరూ రేపు మా పోరాటంలో పాల్గొంటారని తెలిపారు. ప్రభుత్వం మమ్మల్ని టెర్మినేట్ చేయడం కాదు.. మేమే ప్రభుత్వాన్ని రెండు నెలల్లో టెర్మినేట్ చేస్తామన్నారు. ప్రభుత్వం కనీస వేతనం రూ. 26 ఇచ్చేవరకు మా పోరాటం ఆగదని తెలిపారు.