పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి మెలసి పనిచేయాలని వైయస్ఆర్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నాయుడుపేటలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార బస్సుయాత్రకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ సూళ్లూరుపేట అభ్యర్థి విషయంలో రకరకాలుగా ప్రచారం సాగుతోందని, ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యే ఇక్కడి అభ్యర్థనీ ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనకు చెప్పారన్నారు. క్రమశిక్షణరాహిత్యంతో ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సూళ్లూరుపేటకు చెందిన కట్టా సుధాకర్‌రెడ్డి, శ్రీమంతురెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, రిఫీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదన్నారు. మార్పులున్న స్థానాలకే అభ్యర్థులను ప్రకటిస్తారని, అన్ని స్థానాల్లో మార్పులు ఉండవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.