అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాదిమంది రామభక్తుల నిరీక్షణకు తెరదించుతూ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో వేదమంత్రోచ్ఛరణల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తరలివచ్చిన వీవీఐపీలు, వీఐపీలు, సాధుపుంగవులతో అయోధ్యాపూరి భక్తజనసంద్రంగా మారింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ, వ్యాపారరంగాల ప్రముఖులు హాజరయ్యారు.
ఈ వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అయోధ్య రాములవారిని అవమానించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 'శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ఆహ్వానం మేరకు అయోధ్యకు వెళ్లిన చంద్రబాబు.. ఆలయంలోకి చెప్పులు వేసుకొని వెళ్లడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు వెనక్కి నడిచి, చెప్పులు విడిచారు. శ్రీరామునికి జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ చంద్రబాబు బొట్టు పెట్టుకోకుండా కనిపించారు. సోషల్ మీడియాలో చంద్రబాబు రాముడ్ని అవమానించారంటూ ఓ ఫోటో వైరల్ కావడంతో వెంటనే టీడీపీ ఘాటుగా స్పందించింది. 'జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే వరుసగా ఆలయాలపై దాడులు జరిగాయి. దేవతా విగ్రహాలు ధ్వంసం కాబడ్డాయి. సాక్షాత్తూ రామతీర్థంలోని రాముడి తలను నరికేసి మూడేళ్లయినా విద్రోహులను ఇంతవరకు పట్టుకోలేదు. వీటన్నిటిపై జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది. తనను చూడగానే భక్తులకు అవన్నీ గుర్తొస్తాయని కాబోలు అయోధ్యకు వెళ్లకుండా ముఖం చాటేశాడు జగన్ రెడ్డి. అదంతా జనానికి చెప్పుకోలేక... అక్కసు కొద్దీ ఇదిగో, ఇలాంటి ఫేక్ ప్రచారాలకు తెగబడ్డారు వైసీపీ పేటీఎం పెయిడ్ బ్యాచ్' అంటూ మండిపడ్డారు. ఇదంతా తప్పుడు ప్రచారమని.. ఎవరూ నమ్మొద్దని కోరారు.
చంద్రబాబు అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం తనకు అపరిమితమైన ఆనందాన్నిచ్చిందన్నారు చంద్రబాబు. ఆయన ట్విట్టర్ (ఎక్)లో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం ఎదుట నిలుచుని ఉన్న ఫొటోని ట్వీట్ చేశారు. అయోధ్యలో రామమందిరం ఒక గుడి మాత్రమే కాదు.. ఈ ఆలయం మన దేశ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచానికి వినయం, ధైర్యం, ధర్మానికి కట్టుబడటం వంటి అద్భుతమైన విలువల్ని అందజేసిన శ్రీరామచంద్రుడికి మనం సమర్పించే వినయపూర్వక కృతజ్ఞతాంజలి అన్నారు చంద్రబాబు.
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భారతీయులందరి ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది అన్నారు పవన్ కళ్యాణ్. ఈ ఆలయ నిర్మాణం కోసం భరతజాతి కొన్ని శతాబ్దాల పాటు ఎదురుచూసిందని.. కొన్ని తరాలు ఆశగా ఎదురుచూసిన ఘడియలివి అన్నారు. ఇది భారతీయులందరికీ భావోద్వేగ సమయం.. ఇందులో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అని వ్యాఖ్యానించారు. రామమందిరం దగ్గర పవన్ కళ్యాణ్ సెల్ఫీ తీసుకోగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa