ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ మాజీ సీఎం కర్పూరీ థాకూర్‌కు భారతరత్న

national |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 09:58 PM

బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ థాకూర్‌ను మరణానంతరం భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న వరించింది. జన నాయక్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన రెండుసార్లు బిహార్ సీఎంగా పని చేశారు. కర్పూరీ థాకూర్ శతజయంతి సందర్భంగా ఆయనకు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనను వెలువరించింది. 1924 జనవరి 24న నాయీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కర్పూరీ థాకూర్ టీచర్‌గా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1952లో తాజ్‌పూర్ నియోజకవర్గం నుంచి సోషలిస్ట్ పార్టీ తరఫున విధాన సభకు ఎన్నికయ్యారు. ఉద్యోగులు, కార్మికుల తరఫున ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బిహార్‌లో తొలి కాంగ్రెసేతర సీఎంగా కర్పూరీ థాకూర్ రికార్డులకెక్కారు. సోషలిస్ట్ పార్టీ తొలి సీఎం కూడా ఆయనే కావడం విశేషం. 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు సోషలిస్ట్ పార్టీ/భారతీయ క్రాంతి దళ్ తరఫున ఆయన సీఎంగా పని చేశారు. మళ్లీ 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు జనతా పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.


కర్పూరీ థాకూర్ సీఎంగా ఉన్న సమయంలో బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయన హయాంలో బిహార్లో అనేక స్కూళ్లు, కాలేజీలను స్థాపించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఆయన పేదల పాలిట పెన్నిధిగా గుర్తింపు పొందారు. కర్పూరీ థాకూర్ విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో మెట్రిక్యూలేషన్ స్థాయిలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ తప్పనిసరనే నిబంధనను తొలగించారు. బిహార్‌లో ప్రముఖ నేతలైన లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్, దేవేంద్ర ప్రసాద్ యాదవ్ తదితరులకు కర్పూరీ థాకూర్ మార్గదర్శిగా వ్యవహరించారు. 1988 ఫిబ్రవరి 17న 64 ఏళ్ల వయసులో కర్పూరీ థాకూర్ కన్నుమూశారు. ఆయన పేరిట స్టాంపులను రిలీజ్ చేయడంతోపాటు.. జన్ నాయక్ పేరిట దర్భంగా, అమృత్ సర్ మధ్య రైలును నడుపుతున్నారు.


కర్పూరీ థాకూర్‌ (మరణానంతరం) భారతరత్న పురస్కారానికి ఎంపికవడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన కృషి చేశారని మోదీ కొనియాడారు. సమానత్వం కోసం, సాధికారిత కోసం విశేష కృషి చేసిన ఆయనకు శతజయంతి సందర్భంగా భారతరత్న పురస్కారం ఇవ్వడం ఆయన సేవలకు సరైన గుర్తింపు అని మోదీ తెలిపారు. బిహారీలైన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఇంతకు ముందు భారత రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. 1992లో మరణానంతరం భారతరత్న పురస్కారానికి ఎంపికైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సైతం బిహార్ మూలాలున్న నాయకుడే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com