అయోధ్యలో అంగరంగ వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసింది. ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించి మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలోనూ వేడుకలు నిర్వహించారు. అక్కడి ప్రభుత్వాలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే మన పొరుగు దేశమైన పాకిస్థాన్ మాత్రం ఎప్పటిలాగే తన కడుపు మంటను కక్కేసింది. అయోధ్య ప్రారంభోత్సవంపై కారు కూతల కూసింది. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత పాకిస్థాన్ విదేశాంగ శాఖ ట్విటర్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనతో ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. భారత నెటిజన్లు పాక్ వక్రబుద్ధికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం గురించి పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ విదేశాంగ శాఖ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. భారత్‌లోని అయోధ్య నగరంలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోందని ఆ ప్రకటనలో తెలిపింది. అంతటితో ఆగకుండా బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో నిర్మించిన రామ మందిరం రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగులుతుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా మసీదుల జాబితా పెరుగుతోందని తెలిపింది. ఇది అపవిత్రత, విధ్వంసం అంటూ పాక్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పిచ్చి ప్రేలాపనలు చేసింది.
అయోధ్యలో నిర్వహించిన రామ మందిర ప్రారంభోత్సవం గత 31 ఏళ్లుగా భారత్‌లో పెరుగుతున్న మెజారిటీ వాదాన్ని సూచిస్తుందని పేర్కొంది. భారత్‌లో సామాజిక, ఆర్థిక, రాజకీయాల్లో ముస్లింలను దిగజార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించింది. ముస్లింలు, వారి పవిత్ర స్థలాల్లో మతపరమైన మైనారిటీల భద్రతను నిర్థారించాలని పాకిస్తాన్ భారత్ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాక్ విడుదల చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. నిత్యం ఉగ్రవాదం, మైనారిటీల హింసతో ఉండే పాకిస్థాన్.. భారత్‌కు నీతులు చెప్పడం ఏంటని మండిపడుతున్నారు.
అయితే మైనారిటీల అణిచివేతలో ప్రపంచ దేశాల్లోనే ముందు వరుసలో ఉన్న పాకిస్తాన్.. భారత్‌కి నీతి సూక్తులు చెప్పడం విడ్డూరంగా ఉందనే వాదనలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్‌లోని హిందువులు, క్రిస్టియన్స్, అహ్మదీలపై జరుగుతున్న దాడులపై పాక్ మౌనం వహిస్తోందని నెటిజన్లు విమర్శించారు. పాకిస్తాన్‌లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాప్, బలవంతపు మతమార్పిడి, అత్యాచారాలు నిత్యం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై పాక్ ప్రభుత్వం స్పందించకుండా.. భారత అంతర్గత విషయాల్లో తల దూర్చడం ఎందుకు అని మండిపడుతున్నారు.