ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీలో నిత్యం లక్షల మంది ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. తమకు నచ్చిన ఆహారాన్ని క్షణాల్లో ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌లో అగ్రస్థానాల్లో కొనసాగుతున్న కంపెనీల్లో స్విగ్గీ ఒకటి. అయితే, తమ ప్లాట్ ఫామ్ ద్వారా నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్న ఫుడ్ లవర్స్‌కి స్విగ్గీ సైలెంట్‌గా షాకిస్తోంది. ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్లాట్‌ఫామ్ ఫీని రానున్న రోజుల్లో రెండింతలు చేసేందుకు స్విగ్గీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం స్వీగ్గీలో ప్లాట్ ఫామ్ ఫీజు రూ.5 ఉంది. దానిని రెట్టింపు చేసి రూ.10కి పెంచే అవకాశం ఉన్నట్లు నేషనల్ మీడియాలు పేర్కొంటున్నాయి. త్వరలోనే స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టేందుకు ఐపీఓగా రానున్న క్రమంలోనే నష్టాలను తగ్గించుకునేందుకు స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
రూ.2తో మొదలు.. రూ.10కి పెంపు?
స్విగ్గీ మొదటగా 2023, ఏప్రిల్ నెలలో ఫుడ్ డెలివరీలపై ప్లాట్‌ఫామ్ ఫీజును కొన్ని నగరాల్లో అమలులోకి తీసుకొచ్చింది. కార్ట్ విలువతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌పై రూ.2 చొప్పున వసూలు చేసింది. ఆ తర్వాత కొన్ని వారాలకే కస్టమర్లందరి నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టింది స్విగ్గీ. 2 రూపాయలే కావడంతో ఫుడ్ లవర్స్ సైతం పెద్దగా పెట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఇదే అదునుగా ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.5కి పెంచింది స్విగ్గీ. అయితే, కొన్నిచోట్ల ఆర్డర్‌ను బట్టి రూ.3 వరకు వసూలు చేస్తోంది. కానీ, ఈ ఫీజు రూ.10కి పెంచాలని స్విగ్గీ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే కస్టమర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమూ ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న ఆర్డర్లపై రూ.10 పెద్ద సంఖ్యగా కనబడనుందని పేర్కొంటున్నాయి. స్విగ్గీకి రోజుకు 1.5 నుంచి 2.5 మిలియన్ల ఫుడ్ ఆర్డర్లు వస్తున్నాయి.
అయితే, ప్లాట్‌ఫామ్ ఛార్జీల పెంపుపై స్విగ్గీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కొంత మందికి బిల్లులో ప్లాట్‌ఫామ్ ఫీ రూ.10 చూపించి ఆపై ఆఫర్ అంటూ రూ.5 వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాల్లో చర్చ జరుగుతోంది. ప్లాట్ ఫామ్ ఛార్జీలు పెంచే క్రమంలోనే స్విగ్గీ ఇలా చేస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఓ మీడియా సంప్రదించగా.. కస్టమర్లను అర్థం చేసుకోవడానికి కంపెనీ చేపడుతున్న ప్రయోగాల్లో ఇదీ ఒకటని స్విగ్గీ పేర్కొనడం గమనార్హం. ప్లాట్‌ఫామ్ ఫీజుల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పు చేయడం లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ ఛార్జీల పెంపు అమలు చేయొచ్చు, చేయకపోవచ్చంటూ పేర్కొంది.