ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఇచ్ఛాపురం వెళ్లేందుకుగానూ కంచిలి మండలం జాతీయరహదారి అంపురం వద్ద ఆమె ఓ పల్లెవెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి రాకేష్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు కూడా బస్సులో 23కిలోమీటర్లు మేర ప్రయాణించారు. ప్రయాణికులతో అరగంట పాటు షర్మిల మాట్లాడుతూ.. యోగక్షేమాలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై ఆరాతీశారు. బస్సులో పక్క సీట్లో కూర్చొన్న నీలవేణి అనే ప్రయాణికులతో షర్మిలతో మాట్లాడారు. ‘తల్లీ నమస్తే. నువ్వు ఏమి చేస్తుంటావు. నీ భర్త ఏమి చేస్తారు. వ్యవసాయానికి సాగునీరు ఉందా?. ఆదాయం ఎంత వస్తోంద’ని షర్మిల అడిగారు. తాను గృహిణిగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నానని ప్రయాణికురాలు నీలవేణి తెలిపారు. వ్యవసాయంలో ఖర్చు పెరగ్గా ఆదాయం తగ్గిందన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మాదిరి ఈ రాష్ట్రంలో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. తప్పకుండా అమలు చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.