పలాస-కాశీబుగ్గలోని తిలక్‌నగర్‌లో గురువారం చోరీ జరిగింది. కాశీబుగ్గ కేటీరోడ్డులోని ఓ హోటల్ నిర్వాహకుడు గోవిందరావు కుమార్తె రోహిణి.. హైదరాబాద్‌లోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజరుగా పనిచేస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చారు. తల్లిదండ్రులు వ్యాపారరీత్యా బయటకు వెళ్లగా రోహిణి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11గంటల సమయంలో ఓ వ్యక్తి వారింటికి వచ్చి అనాథ శరణాలయం నుంచి వచ్చానని పాతదుస్తులు కానీ, నగదు కానీ ఇవ్వాలని కోరాడు. ఇంట్లో ఎవరూ లేరని ఆమె చెప్పగా ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత భార్యాభర్తలుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తాము మీ నాన్నకు తెలిసిన వాళ్లమని, పెళ్లికార్డు ఇచ్చేందుకు వచ్చామని, తలుపులు తీయాలని చెప్పారు. దీంతో రోహిణి తలుపులు తీయగా.. వెంటనే ఆమె ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశారు. అనంతరం ఆమె మెడపై కత్తి పెట్టి డబ్బులు ఎక్కడని ప్రశ్నించారు. తన వద్ద నగదు లేదని, బంగారం మాత్రమే ఉందని చెప్పడంతో అవి తమకు అవసరం లేదని, కేవలం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిచెన్‌లో రూమ్‌లో నగదు కోసం వెతికారు. అనంతరం బెడ్‌రూములోకి తీసుకువెళ్లి నగదుపెట్టె తాళాలు తీయాలని ఆదేశించారు. అందులో వ్యాపార అవసరాల కోసం దాచుకున్న రూ.1.50లక్షలు తీసుకుని క్షణాల్లో ఇద్దరూ పరారయ్యారు. గంటపాటు ఇద్దరు దొంగలు ఆ ఇంట్లో హల్‌చల్ చేశారు. వారు వెళ్లిపోగానే రోహిణి తన తండ్రికి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ విజయానంద్, క్లూస్‌టీమ్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయానంద్ తెలిపారు.