ఈ నెల 29వ తేదీ రాజమహేంద్రవరం రూరల్ కాతేరులో నిర్వహించనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు బహిరంగసభను జయప్రదం చేయాలంటూ మాజీమంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, గోరంట్ల బుచ్చియ్యచౌదరిలు పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం సాయంత్రం కోరుకొండ శివారు బూరుగుపూడి గేటు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 7 నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజానగరం ఇన్‌చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహి ంచారు. సభ విజయవంతం కావడానికి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌ల సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం కావడానికికావాల్సిన ఏర్పాట్లు చర్చించారు. జన సమీకరణ, 7నియోజకవర్గాల జనసేన ఇన్‌చార్జ్‌ల ఆహ్వానం, సభ నిర్వహణ, తదితర అంశాలపై చర్చించారు. టీడీపీ ఇన్‌చార్జ్‌లకు మాజీ మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బొడ్డు వెంకటరమణ చౌ దరి, వనమాడి కొండబాబు, బండారు సత్యానందరావు, చిల్ల జగదీశ్వరి, జ్యోతుల నవీన్, స్ధానిక నాయకులు తనకాల నాగేశ్వరరావు, గంగిశెట్టి సత్తిబాబు, వలవల రాజా, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.