ఐఐటీ, ఎన్‌ఐటీ, తత్సమాన విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఎ) నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. ప్రధానంగా బీఇ/బీటెక్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవుతారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనున్న ఈ పరీక్షలకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 20 వేల మంది హాజరవుతున్నారు. ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరనున్న విద్యార్థులకు జేఈఈ పేపర్-2 పరీక్ష బుధవారం జరిగింది.విశాఖపట్నం నగరంలో చినముషిషివాడ, షీలానగర్, గాజువాక, ఎన్‌ఏడీ జంక్షన్‌లోని డిజిటల్ సెంటర్లను జేఈఈ మెయిన్స్ పరీక్షలకు కేంద్రాలుగా ఎంపిక చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంటన్నర ముందుగా కేంద్రాలకు చేరుకోవాలి. జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన మార్కులను కటాఫ్‌గా తీసుకుని అడ్వాన్స్‌డ్ ప్రవేశపరీక్షకు అర్హత కల్పిస్తారు. ఎన్‌ఐటీతోపాటు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఇప్పటికే అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.