రబీలో సాగుచేసిన పంటలకు ఫిబ్రవరి 15వ తేదీలోపు ఈక్రాప్ నమోదు పూర్తి చేయాలని పుట్టపర్తి జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఇందు లో జేసీ పాల్గొని మాట్లాడారు. ప్రభు త్వం మంజూరు చేసిన కౌలుకార్డు రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అలాగే పాడి పరిశ్రమకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆదేశించారు. జిల్లాలో కృషి విజ్ఞానకేంద్రం ఏర్పాటుకు స్థలసేకరణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు సకాలంలో అందించాలన్నారు. వ్యవసాయాధికారి సుబ్బారావు మాట్లాడుతూ రబీలో ఈక్రాప్ నమోదు ఇప్పటికే 93శాతం పూర్తి చేశామని తెలిపారు. ఎరువల కొరత లేదని, రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ సలహామండలి చైర్మన రమణారెడ్డి, పట్టుపరిశ్రమ, ఉద్యానశాఖల అధికారి చంద్రశేఖర్, పశుసంవర్ధశాఖ అధికారి సుబ్బరాజు, శాస్త్రవేత్త సంపతకుమార్ పాల్గొన్నారు.