రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ నజీర్ స్వీకరించారు. అలాగే ఓపెన్ టాప్ జీపులో గవర్నర్ పరేడ్ రివ్యూ చేశారు. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్, సీఆర్పీఎఫ్ కంటింజెంట్, తమిళనాడు స్టేట్ పోలీస్ స్పెషల్ కంటింజెంట్ సహా కొన్ని కంటింజెంట్‌లను గవర్నర్ రివ్యూ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్‌కు అధికారులు వివరించారు. ఆపై పరేడ్‌లో వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శనలో ఎన్నికల సంఘం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటు ఆవశ్యకతను తెలియజేసేలా శకటాన్ని రూపొందించారు. గవర్నర్, జగన్ సహా పలువురు శకటాల ప్రదర్శనను తిలకించారు.