ఆంధ్రప్రదేశ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం జగన్ దంపతులు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ నజీర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల పరేడ్‌ను పరిశీలించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను తిలకించగా.. సంక్షేమ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్‌సీసీ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని.. ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉండాలన్నారు. ఐక్యమత్యంగా రాష్ట్రం అభివృద్ధి కోసం అంతా పని చేయాలని.. ఎదురైన అడ్డంకుల్ని అధిగమిస్తూ మన లక్ష్యాల్ని చేరుకోవాలన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రం ఒడిదుడుకులను ఎదుర్కొందని.. ఒడిదుడుకుల్లో ధైర్యంగా నిలిచిన ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం అంకిత భావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని.. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు.
ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గవర్నర్. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా.. రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నారన్నారు. ఈ సంక్షేమ పథకాల్ని నేరుగా ప్రజలకే అందిస్తున్నారని.. 56 నెలలుగా గ్రామస్వరాజ్యం దిశగా సంస్కరణలు జరుగుతున్నాయన్నారు. మారుమూల గ్రామాలకు కూడా సేవలు అందేలా సంస్కరణలు ఉన్నాయని.. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం కలుగుతోందన్నారు. విలేజ్ క్లీనిక్స్‌తో గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు అందుతున్నాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయని.. జగనన్న అమ్మఒడితో ప్రతీ పేద విద్యార్థి చదువుకోగలుగుతున్నారని ప్రశంసించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా విదేశాల్లో చదివేందుకు అవకాశం కలుగుతోందన్నారు. ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్‌తో వైద్యం అభినందనీయమని.. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం సమర్థవంతంగా అమలవుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా నాణ్యమైన వైద్యం అందుతోందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారని.. గర్బిణులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం అందజేస్తున్నారన్నారు.
సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరుకుంటున్నాయన్నారు. పింఛన్లు, రేషన్ నేరుగా ఇళ్లకే వెళ్లి అందజేస్తున్నారని.. ప్రతీనెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి అందించడం అభినందనీయం అన్నారు. పరిపాలన సంస్కరణల్లో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటయ్యాయన్నారు. ప్రతీ ఏడాది స్కూళ్లు తెరవక ముందే విద్యాకానుక.. రూ.2,400 విలువైన జగనన్న విద్యాకానుకను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతోందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు.. స్కూళ్లలో నాడు నేడుతో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు నేరుగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని.. ఏపీ సంక్షేమ పాలనకు తన అభినందనలు తెలిపారు. ప్రస్తుత పాలన రానున్న రోజుల్లో మంచి ఫలితం ఇస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa