ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తోంది. ఇప్పటి వరకు నాలుగు జాబితాలను విడుదల చేసింది.. ఐదో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్ సీఎం జగన్‌తో వేర్వేరుగా కలిశారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేయగా.. ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించారు. నరసరావుపేట ఎంపీ సీటు రేసులో అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది. నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని ప్రచారం జరుగుతోంది. ఆలోచించుకోమని అనిల్‌కు సీఎం చెప్పి పంపినట్లు తెలుస్తోంది. ఆయన కాకపోతే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎంపీ పేరును నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో నాగార్జున యాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు కాకినాడ ఎంపీ వంగా గీత ఫిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. దీంతో కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగాలని కొంతకాలంగా చలమలశెట్టి సునీల్‌ను పార్టీ అధిష్టానం కోరుతోంది. గతంలో ఆయన కాకినాడ లోక్‌సభ అభ్యర్థిగా మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి పోటీ చేసేందుకు ఆయన పెద్దగా ఆసక్తిగా లేరని ప్రచారం జరిగింది. పార్టీ ముఖ్యులు చర్చలు జరిపినా ఆయన పూర్తిస్థాయిలో అంగీకారాన్ని తెలపలేదని సమాచారం. ఈ క్రమంలో ఆయన్ను సీఎం స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. ఆయన పోటీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ రెండు ఎంపీ సీట్లతో పాటుగా ఎమ్మిగనూరు నియోజకర్గ పంచాయతీ కూడా ముగిసింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంఛార్జ్‌గా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించారు.. అయితే వైఎస్సార్‌సీపీ కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభ్యర్థిని మార్చాలని చర్చలు జరిపారు. చివరికి అధిష్టానం మాజీ ఎంపీ బుట్టా రేణుకను ఇంఛార్జ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకంవైపు మొగ్గుచూపారట. త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందంటున్నారు. అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతల వ్యవహారంలో సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిలు పోటీపడుతున్నారు. వీరిని సీఎం క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడినట్లు సమాచారం. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానాన్ని ఎస్వీ మోహన్‌రెడ్డి కోరుతున్న సంగతి తెలిసిందే.