వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి జగన్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, ఆ విమర్శలు తట్టుకోలేని వైకాపా నాయకులు ఒక మహిళ అని కూడా చూడకుండా సభ్యసమాజం సిగ్గుపడేలా విమర్శలు చేస్తున్నారని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ఈ సందర్భంగా శనివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకులు ఎమ్మెల్యేలు ఏ రోజూ ప్రజా సమస్యలపై మాట్లాడని వారు ఇవాళ బయటకొచ్చి షర్మిలపై విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సీఎం జగన్ సమాధానం చెప్పాలని, దిశ చట్టం ఎక్కడ?.. దళితులపై దాడులను షర్మిల ప్రశ్నిస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోతుందా అని నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక వైకాపా నాయకులు షర్మిలపై మాటల దాడి చేస్తున్నారని, ఊరు పేరు తెలియని వారు రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ‘‘మంత్రి రోజా ఎక్కడ నుంచి వచ్చావు.. నిన్ను విమర్శలు చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నావు, అప్పుడు నీకు అండగా మేము ఉన్నాం.. జగనన్న వేసే చిల్లర కోసమో, పదవుల కోసమో, మేము పని చేయడం లేదు’’ అని అన్నారు. మరోసారి వైకాపా నాయకులు షర్మిలపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తండ్రి వైఎస్సార్ మరణాన్ని అడ్డు పెట్టుకుని జగన్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. షర్మిలకు కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారని సుంకర పద్మశ్రీ అన్నారు.