ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. కల్కాజీ ఆలయంలో అర్థరాత్రి సమయంలో కచేరి జరుగుతుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళా భక్తురాలు మరణించగా..మరో 17మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే హుటాహుటీన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వేదిక కూలిపోతున్న సమయంలో దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం సమయంలో కచేరి కార్యక్రమంలో 1600 మంది వరకు భక్తులు ఉన్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కచేరీ చేపట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గత 26ఏళ్లుగా కల్కాజీ ఆలయంలో జాగరణ కార్యక్రమం జరుగుతుంది. అయితే, ఈసారి నిర్వాహకులు మరింత పెద్దఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతి తీసుకోలేదని డీసీపీ సౌత్ ఈస్ట్ రాజేష్ దేవ్ తెలిపారు. ఈ ఘటన తరువాత నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పాటు వేదికపైకి అధిక సంఖ్యలో భక్తులు వెళ్లారు. దీంతో వేదిక కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. వేదిక కూలిపోయిన సమయంలో భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో మహిళా భక్తురాలు మరణించగా.. 17మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులందరినీ అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చనిపోయిన మహిళ ఎవరనేది ఇంకా గుర్తించలేదు.