తాను రాజకీయల నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు గుంటూరు ఎంపీ, తెలుగు దేశం పార్టీ నేత గల్లా జయదేవ్. రాజకీయాల్లో ఉండడం ద్వారా వివాదాలు వస్తున్నాయని, అందుకే తాను వచ్చే 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు గుంటూరులో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు ఎంపీ గల్లా జయదేవ్. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందుల్ని చూస్తూ పార్లమెంట్ లో మౌనంగా ఉండలేను. నా పని పూర్తిగా నిర్వహించ లేకపోతున్నాను. 2024లో మళ్లీ పోటీ చేసినా గెలుస్తాను. కానీ, రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. రెండేళ్ల క్రితం వ్యాపారాల నుంచి మా నాన్న రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు, వ్యాపారాన్ని సమన్వయం చేయడం కష్టంగా మారింది. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా.' అని మీడియా వేదికగా వెల్లడించారు ఎంపీ గల్లా జయదేవ్.
తాను ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నానని, స్థానిక నాయకులు, ప్రజలను నమ్ముకునే రాజకీయాల్లో ముందుగా సాగినట్లు చెప్పుకొచ్చారు ఎంపీ గల్లా జయదేవ్. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడానిట్లు గుర్తు చేశారు. వివిధ కేసుల్లో ఈడీ తనను రెండు సార్లు పిలిచి విచారించిందని, తన వ్యాపారాలపై నిఘా వేసినట్లు తెలిపారు. సీబీఐ, ఈడీలు తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ గల్లా జయదేవ్. ఇక నుంచి పూర్తి స్థాయిలో వ్యాపారాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు ప్రజలు తనకు ఇంత కాలం రాజకీయంగా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు సహజమన్నారు.