లారీ చేసిన బీభత్సం.. అమాయకులు బలి. ఊహకందని ప్రమాదమిది. హైవేపై సాఫీగా వెళ్లిపోతున్న వాహనాలు ఒక్కసారిగా భారీ కుదుపునకు గురయ్యాయి. అత్యంత వేగంగా వచ్చిన లారీ.. వెనుక నుంచి బలంగా ఒక ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆ ట్రక్కు అంతే వేగంతో మరో లారీని ఢీకొట్టింది. ఆ ధాటికి ముందు వెళ్తున్న ఆ లారీ అడ్డంగా తిరిగి బ్రిడ్జి మీద నుంచి కిందకి పడిపోయింది. ఇక ప్రమాదానికి కారణమైన మొదటి లారీ.. ముందున్న లారీని ఢీకొట్టిన తర్వాత ఓ కారును ఢీకొట్టింది. రెండు ట్రక్కుల మధ్య నలిగి ఆ కారు నుజ్జునుజ్జయ్యింది. వెంటనే మంటలు కూడా వ్యాపించాయి. ఆ మంటల్లో కారుతో పాటు మరో లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. కారులో ఉన్న నలుగురు దుర్మరణం పాలయ్యారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా తొప్పూర్ ఘాట్ రోడ్డులో బుధవారం (జనవరి 24) ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్లు గగుర్పొడిపే ఈ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్డు ప్రమాదకరమని ఆ మార్గంలో వెళ్లేవారు చెప్తుంటారు. ముఖ్యంగా.. ఈ ప్రమాదం జరిగిన చోట హైవే నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. హైవే ఎలివేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి రోడ్డు ప్రమాదకరంగా ఉందని తెలిసి కూడా.. కొందరు వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్తుంటారు. అలా మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఇంతటి ఘోర ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదం బ్రిడ్జిపై జరగడంతో తీవ్రత ఎక్కువగా ఉంది. లారీ డ్రైవర్ చేసిన తప్పుకి కారులో వెళ్తున్నవారు బలైపోయారు. కారులో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మరో కారు కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా దెబ్బతింది. హైవేపై ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. తొప్పూర్ ఘాట్ సెక్షన్‌లో హైవే ఎలివేషన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ హైవే ఎలివేషన్ పనులు పూర్తయితే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు.