అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి దర్శనం కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆలయం ప్రారంభించిన తర్వాత 6 రోజుల్లోనే దాదాపు 19 లక్షలమంది భక్తుల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ రద్దీ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అంచనా వేస్తోంది. వీకెండ్‌లో ఈ రద్దీ ఎక్కువగా ఉంటోంది.. అందుకే అయోధ్య ఆలయ ట్రస్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల విషయంలో టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్‌లో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది టీటీడీ. ఎంత రద్దీ ఉన్నా సరే తగిన ఏర్పాట్లు చేస్తోంది.. అందుకే భక్తుల రద్దీ విషయంలో టీటీడీ అవలంబిస్తున్న నిర్వహణ పద్ధతుల అధ్యయనం కోసం త్వరలోనే అయోధ్య నుంచి ఓ బృందం తిరుమలకు రానున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్లారు. ఆ సమయంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. భక్తుల రద్దీ నియంత్రణకు ఉత్తమ విధానాలను అధ్యయనం చేయడానికి తిరుమలకు వెళ్లబోతున్నారట. అయితే ట్రస్ట్ సభ్యులు ఎప్పుడు వెళతారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు 50 నుంచి 60 వేల మందికిపైగా వస్తుంటారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పండుగలు, సెలవు రోజులు, వీకెండ్‌లో ఈ సంఖ్య 70 వేల నుంచి ఒక్కోసారి 90 వేల వరకు ఉంటుంది. ఎంత రద్దీ ఉన్నా సరే టీటీడీ తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది.. దర్శన క్యూ లైన్లు, లడ్డూ కౌంటర్లు, టోకెన్ సెంటర్లు, అన్నప్రసాదం, వసతి గదులు వంటి సౌకర్యాలు అందిస్తోంది. రద్దీని బట్టి టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు శబరిమలలో కూడా తిరుమల తరహాలో భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. గతంలో మహారాష్ట్రలోని షిర్డీ సంస్థాన్, జమ్మూలోని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే తిరుమలను సందర్శించింది. ఇప్పుడు అయోధ్య ఆలయ ట్రస్ట్ కూడా తిరుమలలో భక్తుల రద్దీ, ఇతర అంశాలపై అధ్యయనం చేయనుంది.
అంతేకాదు అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డూప్రసాదాన్ని టీటీడీ పంపించింది. ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపారు. లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు సౌరభ్ బోరా 2 వేల కిలోలు, మాజీ బోర్డు సభ్యులు జూపల్లి రామేశ్వరరావు 2 వేల కిలోల దేశీయ ఆవు నెయ్యిని విరాళంగా అందించారు. అయోధ్యలో శ్రీరా మందిరం ప్రారంభోత్సవం నాడు భక్తులకు పంపిణీ చేశారు.