తిరుమల ఆస్థానమండపంలో ధార్మిక సదస్సు ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హిందు ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారాన్ని మరింత విసృతంగా నిర్వహించేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు సలహాలు స్వీకరించేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హజరవుతున్నారని.. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో దళిత గోవిందవ, కళ్యాణమస్తు, కళ్యాణోత్సవాలు వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సనాతన ధార్మిక సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేయాలని ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జరగనున్న సనాతన ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంటారన్నారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముగ్గురు సీనియర్ అధికారులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించాలన్నారు. అదేవిధంగా ప్రతి స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించాలన్నారు. సదస్సు నిర్వహణకు ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ఆహార, రవాణా తదితర కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకోవాలన్నారు. అదేవిధంగా టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై ఎస్వీబీసి వీడియో రూపొందించాలని ఆదేశించారు. సదస్సులో పాల్గొనే స్వామిజీల సలహాలు, సూచనలు తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు. ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.