తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటోంది. మంగళవారం ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద నడిరోడ్డుపై యూనిట్ షూటింగ్ చేయడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో తిరుమల కొండపైకి వెళ్లే వాహనాలతో పాటు స్కూల్ బస్సులు ఇతర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ మార్గంలో షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు సినిమా యూనిట్‌తో వాగ్వాదానికి దిగారు.
అనంతరం అక్కడ షూటింగ్ ముగించుకున్న యూనిట్ కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయ గోపురం దగ్గర పలు సన్నివేశాలను షూట్ చేశారు. దీంతో ఆలయాలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై కొందరు నిలదీయగా యూనిట్ సభ్యులు దురుసుగా వ్యవహరించారు. గోవిందరాజస్వామి ఆలయం వద్ద చిత్రీకరణ సమయంలో అక్కడా స్థానికులు అడ్డుకున్నారు. కొందరి సెల్‌ఫోన్లను యూనిట్ సభ్యులు లాక్కోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్రీకరణకు అడుగుడుగునా ఆటంకాలు ఏర్పడటంపై చిత్ర యూనిట్ అసహనం వ్యక్తం చేసింది. మంగళ, బుధవారాల్లో షూటింగ్‌కు ఈనెల 27నే అనుమతులు వచ్చాయని.. నిబంధనల మేరకు సొంత సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల పర్యవేక్షణలో చిత్రీకరణ చేస్తుండగా అనూహ్యంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు యూనిట్ ప్రతినిధులు చెబుతున్నారు.
దీనిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డితో పాటు వివిధ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నగరానికి అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారని.. షూటింగుల పేరుతో అందరినీ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని భానుప్రకాష్ హెచ్చరించారు. ఇంత రగడ జరగడంతో యూనిట్ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేసింది. బుధవారం షూటింగ్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీచేశారు.
ఇదిలా ఉంటే తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్‌కు సంబంధించి అనుమతిని రద్దు చేశారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వవద్దని పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వారిపై ఈస్ట్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆధ్మాత్యిక క్షేత్రం.. అది తిరుమలకు వెళ్ళే రోడ్డు.. ఎలా షూటింగ్ అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే షూటింగ్ అనుమతి రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా.. తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించి అనుమతిని రద్దు చేశారు.