శాంతిభద్రతలతో పాటు మహిళల భద్రత పెంచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని మచిలీపట్నం ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన అద్నాన్ నయీం అస్మీ అన్నారు. బుధవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సిబ్బంది సంక్షేమంపై దృష్టిసారిస్తానన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సక్రమంగా నిర్వహించేందుకు సిబ్బందికి తగిన సూచనలు ఇస్తానన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ట్రైనింగ్ ఎస్పీగా కృష్ణాజిల్లాలో శిక్షణ పొందానని, నేర రహిత జిల్లాగా మారుస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను కొనసాగిస్తానన్నారు. అనంతరం ఎస్పీ.. కలెక్టర్ రాజాబాబును, జిల్లా జడ్జి అరుణసారికను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్పీని ఏఆర్‌ఎస్పీ ప్రసాద్ డీఎస్పీలు, సీఐలు మర్యాదపూర్వకంగా కలిశారు.