‘మెగా డీఎస్సీ అని ఊదరగొట్టారు. ఇప్పుడు కేవలం 6 వేల పోస్టులతో ఉత్తుత్తి డీఎస్సీ నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నారు. ఇలా ప్రభుత్వ తీరు నిరుద్యోగులను నిరాశ పరుస్తోంది’ అని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్‌మోహన్, బోడే మోహన్ విమర్శించారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం ముందు బుధవారం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రద్దు చేయించిన అప్రెంటీస్ విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం దుర్మార్గమన్నారు. పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేశారు. వేతన సవరణ కమిటీ వేసి నెలలు గడుస్తున్నా ప్రయోజనం లేదని, కనీసం మధ్యంతర భృతిపై చర్చించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ఆందోళనలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గంటా మోహన్, అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, నాయకులు దేవరాజులురెడ్డి, చంద్రన్, రాధాకుమారి, కిషోర్, సురేష్, హరీష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.