ఉపాధి దినసరి కూలి ఈరలక్కప్పకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మడకశిర అసెంబ్లీ టికెట్ ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మడకశిర నియోజకవర్గంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో కార్యకర్తలు సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త శాంతమ్మ పాల్గొన్నారు. ‘సిద్ధం’ పోస్టర్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రతి మండలానికి వందల కోట్ల రూపాయలు పథకాల ద్వారా లబ్ధి జరిగిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హంద్రీనీవా పూర్తి చేసి వీలైనంత త్వరగా అన్ని ప్రాంతాలకు నీరు అందిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని మంత్రి విమర్శించారు. ఉపాధి హామీ దిన కూలి అయినా ఈరలక్కప్పకు సీఎం జగన్ మడకశిర టికెట్ ఇచ్చారని.. ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా అంటూ సవాల్ విసిరారు. ఏ పార్టీ డబ్బు ఉన్నవాళ్ళకి టికెట్ ఇస్తుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. 99.5 శాతం ఎన్నికల హామీలు అమలు చేసిన ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. గతంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు ఇచ్చేవారని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో భారీ విజయంతో వైయస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.