సెల్‌ఫోన్ పుణ్యమా అని ప్రపంచం నలుమూలల్లో ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అందులో నిజానిజాలు పక్కనబెడితే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి కొన్ని వార్తలు. జనం కూడా దాని వెనకున్న నిజం గురించి ఆలోచించరు. ఆసక్తికరంగా ఉంటేచాలు షేర్ చేస్తుంటారు. కానీ అలా చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అంటున్నారు కడప పోలీసులు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం తప్పుడువార్తలు రాస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే కడప పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అదేంటంటే ..
రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని కంటైనర్లలో తరలిస్తున్నారు. వీటికి కడప పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే కంటైనర్ల ద్వారా వేలకోట్ల రూపాయల నగదు తరలిస్తున్నారంటూ కొంతమంది దుండగులు ప్రచారం మొదలెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఈ తప్పుడు వార్తలను వైరల్ చేయడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కంటైనర్లలో వేలకోట్లు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ తీవ్రంగా హెచ్చరించారు.
కంటైనర్లలో రక్షణశాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నై తరలిస్తున్నట్లు కడప డీఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది ఎస్కార్టుగా పనిచేస్తున్నారని వివరించారు. అయితే కంటైనర్లలో వేలకోట్లు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందన్న కడప డీఎస్పీ.. ఇలాంటి దుష్ప్రచారం తగదని అన్నారు దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామన్నా్రు. వాస్తవాలను దాచి సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.