సమకాలీన అంశాలు, రాజకీయ పరిస్థితులపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వినిపించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి భారతరత్న ఇవ్వటంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజమండ్రిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ సీఎం జగన్ వైఖరిని తప్పుబట్టారు. సీఎం జగన్ ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాల తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో జగన్ తరుఫున కాదు.. జగనే పోటీచేస్తున్నారనే భావనలో సీఎం ఉన్నారని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తున్నాయనే భయం జగన్‌లో కనిపించడం లేదన్నారు.
మరోవైపు ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందో అంచనావేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. గ్రామీణ ప్రాంతాల ప్రజలలో అత్యధిక మంది వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. అయితే అర్భన్ ప్రాంతాలకు వచ్చేసరికి పరిస్థితిలో మార్పు కనిపిస్తోందంటున్నారు. అర్భన్ ప్రాంతాల్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని హెచ్చరించారు. ఎన్నికల హామీలకు సంబంధించి వైసీపీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని టీడీపీ చెప్తోందన్న ఉండవల్లి.. అది ఎలా సాధ్యమో అర్థం కావడం లేదన్నారు. ప్రజలు కూడా ఇలాంటి విషయాలను పరిశీలించాలని కోరారు.
మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై ఉండవల్లి అరుణ్ కుమార్ పెదవి విరిచారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూసిందని మండిపడ్డారు. అయితే ప్రశ్నించడానికి మనరాష్ట్రంలోని ఎంపీలందరూ బీజేపీకి మద్దతుదారులేనని వ్యాఖ్యానించారు. దేశంలో దేవుడిపేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అయోధ్యలో రామాలయం కట్టడం తప్పు కాదనీ.. అయితే దేవుడి పేరుతో రాజకీయలబ్ధి పొందాలని చూడటం తగదని అన్నారు. అలాగే అబద్ధాలు ప్రచారంలో భారత్ నంబర్ వన్ స్థానంలో ఉంటే, అగ్రరాజ్యం అమెరికా ఆరోప్లేసులో ఉన్నట్లు వివరించారు. ఇదే సమయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ఇవ్వటంపై ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అద్వానీ ప్రధానమంత్రి అవుతారని అనుకున్నానన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. కానీ ఆయనను ప్రధానిగా చూడలేకపోయానని అన్నారు. తర్వాత రాష్ట్రపతి అవుతారని అనుకుంటే అదికూడా సాధ్యం కాలేదన్నారు. భారతరత్న వలన అద్వానీకి ప్రత్యేకంగా గౌరవం పెరగదన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. మహా అయితే టోల్‌గేట్ వద్ద ఉచితంగా ఎంట్రీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే భారతరత్న విషయంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలపై కొంతమంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం గురించి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు.