మహిళా సాధికారత, ఆర్థిక అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకువచ్చినవే మహిళా మార్టులు. ప్రతి నియోజకవర్గంలోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా తొలుత పట్టణ స్థానిక సంస్థల్లోని టిడ్కో ఇళ్లవద్ద మహిళా మార్టులు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. పులివెందులలో ప్రారంభించిన మహిళామార్టు సక్సెస్ కావటంతో త్వరలోనే 21 చోట్ల ప్రారంభించనున్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులే మహిళా మార్టుల్లో వాటాదారులుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ 150 రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ మార్టులకు మహిళలే అధ్యక్షులుగా, సెక్రటరీ, ట్రెజరరీలుగా ఉంటారు. సంవత్సరానికి ఖర్చులు, ఆదాయం చూసుకుని లాభాలను పెట్టుబడి పెట్టిన మహిళలందరూ పంచుకుంటారు.సరుకుల కొనుగోలు దగ్గర నుంచి నిర్వహణ వరకూ వారే చూసుకోవాల్సింది ఉంటుంది. మహిళా మార్టుల ద్వారా నాణ్యమైన సరకులను తక్కువ ధరకే అందిస్తారు. గ్రూపుల్లో ఉండే మహిళలతో పాటుగా ఎవరైనా మహిళా మార్టుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఇక ఇంటర్, డిగ్రీ వరకూ చదువుకుని ఆసక్తి కలిగిన 11 మంది మహిళలు, మండల సమాఖ్య నిర్దేశించిన సభ్యులు, కార్యనిర్వహక సభ్యులతో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మార్టుకోసం అవసరమైన నిత్యావసరాలు, సరుకులు ఎంపిక చేసిన కంపెనీల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే నాణ్యతలో ఏమాత్రం రాజీలేకుండా తక్కువ ధరకే వినియోదారులకు అందించాల్సి ఉంటుంది. అలాగే మహిళా మార్టులపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఎప్పటికప్పడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆన్‌లైన్‌లో ఫ్లిఫ్ కార్ట్ వంటి కంపెనీలతో అనుసంధానమై వ్యాపారం చేసుకోవచ్చు.