ఏపీలో వీఆర్‌ఏలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19,359 మంది గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏలు) డీఏను రూ.300 నుంచి రూ.500 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని తెలిపింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం జరుగుతోందని.. రిటైర్మెంట్ రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో ఫేక్ మెసేజ్ తిప్పుతున్నారన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదన్నారు. పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, పీఆర్సీ, డీఏ బకాయిలు సైతం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలు జరుపుతారని.. ఆ సమావేశంలో ఐఆర్ ప్రకటన సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభుత్వం 15-20 రోజులు మాత్రమే పని చేస్తుందని.. ఈ సమయంలో కొత్త పనుల కోసం ఉద్యోగులు ఎవరూ ప్రయత్నించవద్దని కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఐఆర్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు.