ఏపీలో ప్రయాణికులకు ముఖ్య గమనిక..ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టాటా-ఎర్నాకుళం-టాటా మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం త్రిపాఠి తెలిపారు. టాటా- ఎర్నాకుళం(08189) ప్రత్యేక రైలు ఈ నెల 5, 12 తేదీల్లో తెల్లవారుజామున 5.15 గంటలకు టాటాలో బయలుదేరి అదే రోజు రాత్రి 8.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది అన్నారు. అక్కడి నుంచి 8.45 గంటలకు బయలుదేరి వెళుతుందన్నారు. ఎర్నాకుళం-టాటా(08190) ప్రత్యేక రైలు ఈ నెల 8, 15 తేదీల్లో ఉదయం 7.15 గంటలకు ఎర్నాకుళంలో బయలుదేరి మర్నాడు మధ్యాహ్నం 12.08 గంటలకు దువ్వాడ చేరుకొని ఇక్కడి నుంచి 12.10 గంటలకు బయలుదేరుతుందన్నారు.
సాంకేతిక కారణాలతో రెండు రైళ్ల బయలుదేరే సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. చెన్నై సెంట్రల్- భువనేశ్వర్(12829) రైలు ఈనెల 2న ఉదయం 10 గంటలకు బదులు మధ్యాహ్నం 3.30 గంటలకు.. అలాగే పురులియా-విల్లూపురం(22605) ఎక్స్‌ప్రెస్ ఉదయం 10 గంటలకు బదులు 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం 4 గంటలకు బయలుదేరాయన్నారు. ఆధునికీకరణ పనుల కారణంగా ఈ నెల 4, 7, 11, 14, 18, 21, 25, 28 తేదీల్లో విశాఖ - గుణుపూర్ - విశాఖ (08522-08521) రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఆయా రోజుల్లో గుణుపూర్-రూర్కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ పలాస-రూర్కెలా మధ్య మాత్రమే నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.