పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే గోవా బీచ్‌లో... గాజులమ్ముకునే మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ పాటిల్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. కోవిడ్ అనంతర బీచ్‌లో చోటుచేసుకున్న మార్పులను ఆమె స్పష్టంగా ఆంగ్లంలో వివరిస్తుంది. గోవాలోని రద్దీ ఎక్కువగా ఉండే బీచ్‌ల కంటే ప్రశాంతత కోరుకునే పర్యాటకులకు బ్లాక్ రాక్ క్లిఫ్‌లు, సహజ అందాలకు ప్రసిద్ధి చెందిన వాగేటర్ బీచ్.. ఇలాంటి వారికి ఇది కాలంగా స్వర్గధామంగా ఉంది. ఆ వీడియోలో మహిళ గాజులు, పూసల హారాలు అమ్ముతున్నట్లు కనిపిస్తుంది. ఆమె వీడియోలో బీచ్‌లో మారుతున్న ప్రకృతి దృశ్యాన్ని ఆంగ్లంలో చక్కగా వివరించింది.
ఈ వీడియోకు ఇప్పటికే వేలాది లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. ఆంగ్ల భాషపై ఆమెకు ఉన్న పట్టు, అద్భుతంగా మాట్లాడుతుండటంతో వీడియో ఆకట్టుకుంటోంది. బీచ్‌లో ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత వచ్చిన మార్పులను వివరించడంలో ఆమె భాషా సామర్థ్యాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. కొందరు ఆమెతో పోల్చితే తమ ఇంగ్లిష్ పరిజ్ఞానం జీరో అని కామెంట్ చేస్తున్నారు. కాగా, సోషల్ మీడియా పుణ్యమా అని ఇటువంటి వారి ప్రతిభ వెలుగులోకి వస్తోంది. గతంలో చెన్నై వీధుల్లో బిచ్చమెత్తుకున్ని జీవనం సాగించిన వృద్ధురాలు.. ఇంగ్లీష్ ట్యూటర్‌గా మారిపోయింది. ఆ బిచ్చగత్తెను ఇంగ్లీష్ టీచర్‌గా మార్చిన ఘనత మొహమ్మద్ ఆషిక్ అనే కంటెంట్ క్రియేటర్‌కు దక్కుతుంది.
ఆ వృద్ధురాలు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయిన అతడు.. ఆమె గురించి ఆరా తీశాడు. తన పేరు మెర్లిన్ అని, మయన్మార్ అని చెప్పింది. అక్కడ గణితం, ఇంగ్లీష్ పాఠాలు బోధించే టీచర్‌గా పనిచేశానని, భారతీయ వ్యక్తితో వివాహం తర్వాత చెన్నై వచ్చేశానని తెలిపారు. దురదృష్టవశాత్తూ తన కుటుంబసభ్యులందరూ చనిపోవడంతో ఒంటరిదాన్ని కావడం వల్ల మరో దిక్కులేక బిక్షమెత్తుకుని జీవిస్తున్నానని తన దీనగాథను వివరించింది. ఆమె కథను విని చలించిపోయిన ఆషిక్.. ఆన్‌లైన ఇంగ్లీష్ టీచర్‌గా తీర్చిదిద్ది తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇంగ్లీష్ విత్ మార్లిన్ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఆమెకు ఓ కొత్త చీరను బహుమతిగా ఇచ్చాడు. ఇక, అంతే ఆమె జీవితం మారిపోయింది.