ఈ ఏడాది వేసవిలో తొలుత మోస్తరు వేడి, ఆ తరువాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు మోడళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారు. గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో తీవ్రంగా ఉన్నందున దాని ప్రభావంతో వేసవిహాట్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ తరువాత ఎల్‌నినో బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడే క్రమంలో పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా వాతావరణ పరిస్థితులు ఏర్పడి సెప్టెంబరు నాటికి లానినా పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ నాటికి తటస్థ పరిస్థితులు నెలకొనేందుకు 73 శాతం అవకాశం ఉందని నాలుగు రోజుల క్రితమే భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంనాటికి మరింత బలపడిన ఎల్‌నినో.. మే, జూన్ నుంచి బలహీనపడి తొలుత తటస్థంగా తరువాత లానినా దశకు చేరుకుంటుందని, ఈ క్రమంలో ఈ ఏడాది చివరికల్లా బలమైన లానినాగా మారుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. సెప్టెంబరునాటికి లానినా ఏర్పడనున్నందున నైరుతిలో మంచి వర్షాలు కురుస్తాయని విశ్లేషించింది. కాగా, ఈ ఏడాది వేసవి తీవ్రంగా ఉంటుందని, అయితే, వచ్చే నైరుతి సీజన్‌లో వర్షాలపై ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ రాజీవన్ వివరించారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో 60 శాతం లానినా పరిస్థితులు ఏర్పడతాయని అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(నోవా) అంచనా వేసింది. భారత దేశ వాతావరణంపై ఎల్‌నినో ఎక్కువ ప్రభావం చూపుతుందని, రానున్న వేసవి వేడిగా ఉంటుందని, నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతాయని, అయితే సీజన్ చివరినాటికి మంచి వర్షాలు కురవడంతోపాటు వచ్చే శీతాకాలంలో తీవ్రమైన చలి ఉంటుందని విశ్లేషించింది. ఈ ఏడాది వేసవిలో వేడి ప్రభావం పెరగడంతో వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయని నోవా తెలిపింది. అయితే రానున్న సీజన్‌లో ఎండలపై వచ్చే నెలలో పూర్తిస్థాయిలో అంచనా నివేదిక విడుదల చేస్తామని వాతావరణ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రెండు నెలల తరువాత ఎల్‌నినో తీవ్రత తగ్గి తటస్థ పరిస్థితులు నెలకొంటాయని వివరించారు.